
సినీ రంగంలో ఒక్కటిరెండు సినిమాలతోనే భారీ గుర్తింపు తెచ్చుకున్న తారలు చాలామందే ఉన్నారు. ప్రత్యేకంగా హీరోయిన్స్ విషయంలో, మొదటి సినిమా హిట్ అయిన వెంటనే ఓవర్‌నైట్ స్టార్డ్మ్ అందుకున్న తరలేందరో. అయితే అందం, అభినయంతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నా, కొంతమంది తమ క్రేజ్‌ను నిలబెట్టుకోవడంలో విఫలమయ్యారు. అలాంటి వారిలో ఒకరు మయూరి కాంగో.
మయూరి కెరీర్ ప్రారంభంలో వరుస అవకాశాలు దక్కించుకుంది. మహేష్ బాబు నటించిన ‘వంశీ’ చిత్రంలొ నటించింది ఈ అమ్మడు. మహేష్ బాబుకి స్నేహితురాలిగా నటించిన ఈ నటి, మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాతో తెలుగులో పాపులర్ అయినప్పటికీ, మయూరికి ఆ తర్వాత అటు తెలుగు, ఇటు హిందీ సినిమాల్లో సరైన అవకాశాలు దక్కలేదు.
హిందీ చిత్ర పరిశ్రమలో ఆమె 1995లో ‘నసీమ్’ అనే సినిమాతో అడుగుపెట్టింది. అనంతరం ‘పాపా కెహతే హై’, ‘బేటాబీ’, ‘హోగీ ప్యార్ కీ జీత్’, ‘బాదళ్, ‘పాపా ది గ్రేట్’, ‘జంగ్’, ‘శికారీ’ వంటి చిత్రాల్లో నటించింది. బాలీవుడ్లో పలుచోట్ల కనిపించినా, ఆమె కెరీర్లో పెద్ద బ్రేక్ మాత్రం రాలేదు. వెండితెరపై ఆశించిన స్థాయిలో పేరు తెచ్చుకోలేకపోయిన మయూరి, బుల్లితెర వైపు కూడా మొగ్గు చూపింది. సీరియల్స్ ద్వారా ప్రేక్షకులను పలకరించినా, అక్కడా సక్సెస్ అందుకోలేకపోయింది.
2003లో మయూరి, ఎన్ఆర్ఐ అయిన ఆదిత్య థిల్లాన్ను వివాహం చేసుకొని అమెరికాలో సెటిల్ అయింది. న్యూయార్క్‌లో స్థిరపడిన ఆమె, అక్కడే పాఠశాల చదువులు కొనసాగించి, బరూచ్ కాలేజ్‌లోని జిక్లిన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుండి ఎంబీఏ పూర్తి చేసింది. ఈ అనంతరం గ్లోబల్ మీడియా ఏజెన్సీ అయిన “పెర్ఫామిక్స్” లో ఎండీగా పనిచేసింది.
ప్రస్తుతం మయూరి కాంగో, గూగుల్ ఇండియాలో హెడ్ ఆఫ్ ఇండస్ట్రీగా బాధ్యతలు నిర్వహిస్తోంది. డిజిటల్ స్ట్రాటజీస్, ఇన్నోవేషన్ విభాగంలో తన ప్రతిభను చూపిస్తూ, కార్పొరేట్ ప్రపంచంలో సత్తా చాటుతోంది. ఒకటిరెండు సినిమాలతో నటిగా మెరిసిన మయూరి, ప్రస్తుతం గ్లోబల్ టెక్ జెయింట్‌లో కీలక స్థానాన్ని అలంకరించడమే కాకుండా, ఎంతో మంది యువతికి ప్రేరణగా నిలుస్తోంది ఈ ముద్దుగుమ్మ.